Srikanth Miryala
Srikanth Miryala

@miryalasrikanth

19 Tweets 15 reads Apr 20, 2022
ఆల్కహాలు గురించి తెలుసుకుందాం. ఆల్కహాల్ కల్లు,సారా,బీరు,వైను,బ్రాందీ,వోడ్కా మొదలైన వాటిల్లో వేరు వేరు మోతాదుల్లో ఉంటుంది అందువలన వాటిని తాగితే వచ్చే మత్తు,కిక్కులో కూడా తేడా ఉంటుంది. ఆల్కహాల్ సాధారణంగా జీర్ణాశయంలోనుండి తిన్నగా కాలేయానికి వెళ్తుంది, అక్కడ చాలా మటుకు ఆల్కహాల్
నిర్వీర్యం అయ్యి కొంతమటుకు రక్తంలో ఉండిపోతుంది,దానిని కాస్తా గుండె మెదడుకి పంపుతుంది. మెదడులో కొన్ని రిసెప్టార్ల మీద ఈ ఆల్కహాల్ పనిచెయ్యడం ద్వారా రక్తంలోని ఆల్కహాల్ మోతాదు బట్టి తాగినవారి ప్రవర్తన మారుతుంది. కొద్ది మోతాదులో ఇది ఆనందాన్ని కలిగించి, ఆందోళనని తగ్గించి, ప్రేలాపనకి
దారితీస్తుంది, అంతే కాకుండా దీనివలన కొంచెం మాట తొఱ్ఱుపాటు రావటం, తూలటం, ప్రతిస్పందన సమయంపెరిగి సమయానికి సరిగ్గా పట్టులేకపోవడం జరుగుతుంది. ఇంకా మోతాదు పెరిగినపుడు మెదడు స్తబ్దుగా అయిపోవడం, నిద్రపోవడం, కొన్నిసార్లు కోమాలోకి వెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా మిగిలిన మత్తు పదార్ధాలతో
తీసుకున్నప్పుడు ఊపిరికోసం పేస్ మేకర్ లా పనిచేసే మెదడులోని భాగం పనిచెయ్యడం ఆగి చనిపోతారు. అయితే ఈలోగా రహదారి ప్రమాదాలు జరగటం లేదా పట్టు తప్పి పడిపోయి తలకి దెబ్బతగలడం మొదలైనవి జరగొచ్చు. ఆల్కహాల్ తాగినప్పుడు ఏం జరుగుతుంది? ఆల్కహాల్ జీర్ణాశయం గోడల్ని చికాకు పెడుతుంది, అందువలన
వాంతులవుతాయి.అలాగే జీర్ణాశయంలో ఆసిడ్ స్రావకం పెరిగి అల్సర్స్ వస్తాయి. అలాగే జార్ణాశయం నుంచి ఆసిడ్ పైకి ఆహార గొట్టంలోకి వెళ్లి అక్కడ మంట పెడుతుంది.కొంతమందిలో వాంతి అయినపుడు మత్తులో ఆహారం కొన్నిసార్లు గాలిగొట్టం లోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఊపిరాడక చనిపోవడం లేదా న్యుమోనియా రావటం
జరుగుతుంది.ఆల్కహాల్ వలన ముందుగా కాలేయం వాచి కడుపులో కుడిపక్కన పక్కటెముకలకింద నొప్పెడుతుంది. తర్వాత కాలేయంలో కణాల్లో కొవ్వు చేరటం,కొవ్వు చేరిన కణాలు పగిలి,మళ్ళీ పెరిగి కాలేయం రూపు కోల్పోవడం,కొన్నాళ్ళకి కాలేయం ఒక రాయిలా తయారయి పూర్తిగా పనిచెయ్యకపోవటం, అలాగే కాలేయంలో కాన్సర్ రావటం.
కాలేయం గట్టిగా రాయిలా అయినపుడు, రక్తం కాలేయం గుండా గుండెకి వెళ్లకుండా జీర్ణాశయం, పేగుల చుట్టూ ఉండిపోతుంది, దీనివలన అన్నవాహికలో రక్తనాళాలు పగిలి రక్తపు వాంతులు అవటం, అలాగే జీర్ణాశయంలో రక్తస్రావం అయ్యి మలం నల్లటి రంగులో రావటం జరుగుతుంది. కాలేయం మన దేహంలో సుమారు రెండువందల పనులు
చేస్తుంది, అది అవి చెయ్యటం మానెయ్యటం వలన జుట్టు రాలిపోవడం, బుగ్గలు లోపలి పోవటం, గవదలు వాయటం, కండరాలు కృశించటం, మగవారిలో వక్షోజాలు పెరగటం, చర్మం పలచబడటం, పసుపురంగులోకి మారటం, కడుపు ఉబ్బటం, దానివలన ఆయాసం రావటం, వృషణాలు చిన్నవైపోవటం, లైంగిక పటుత్వం తగ్గటం, పిల్లలు పుట్టకపోవటం
జరుగుతుంది. అంతేకాకుండా ఎముకలపై పనిచేసి అందులోంచి రక్తం తయారీని నిలిపేయటం, క్లోమగ్రంధిలో స్రావాలని చిక్కగా చేసి రాళ్లు ఏర్పరిచి దాని వాపుకి కారణమవ్వటం, దానివలన తీవ్రమైన భరించలేని కడుపునొప్పి రావటం, అలాగే అది మధుమేహానికి దారితీయటం జరుగుతుంది. మూత్రపిండాల పనితీరు తగ్గటం,వాటికీ
కాన్సర్ రావటం. మెదడు పరిమాణం తగ్గటం, మతిమరుపు రావటం, ఫిట్స్ రావటం, అలాగే ఆల్కహాల్ వలన సైకోసిస్,దిగులు, ఆందోళన మొదలైన మానసిక సమస్యలు రావటం. ఎన్నాళ్ళో తాగి ఒక్కసారిగా ఆపెయ్యటం వలన డెలీరియం అనే అయోమయానికి గురవ్వటం. దానికి వేళకి వైద్యం చెయ్యకపోతే శాశ్వతంగా మెదడుకి నష్టం జరగటం లేదా
ప్రాణహాని ఉండటం. ఇవి కాకుండా ఆల్కహాల్ లో కలిసే కొన్ని రసాయనాల కల్తీ వలన చూపు కోల్పోవటం, హఠాన్మరణం సంభవించటం జరుగుతుంది.స్త్రీలలో దేహంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వలన వారిలో ఆల్కహాల్ ఎక్కువ నిల్వ ఉండి త్వరగా వ్యసనానికి గురవుతారు.అలాగే గర్భం దాల్చినపుడు తాగటం వలన శిశువు మెదడు శాశ్వతంగా
దెబ్బతినడం, శారీరక ఎదుగుదల లేకపోవటం, బుద్ధిమాంద్యం రావటం జరుగుతుంది. ఇది గుండెపై కూడా ప్రభావాన్ని చూపుతుంది, రక్తపోటు రావటం, గుండె వాపు రావటం జరుగుతుంది. ఆల్కహాల్ వలన ప్రమాదాలు జరగటం, విచక్షణ కోల్పోయి, క్షణికావేశంలో నేరాలకు పాల్పడటం లేదా ఆత్మహత్య చేసుకోవటం జరుగుతుంది.
ఆల్కహాల్ తాగేవారి పిల్లలు తీవ్ర మానసిక క్షోభకి గురవుతారు, వారికీ వారి తల్లిదండ్రుల ప్రవర్తన వలనఅయోమయం రావటం దానివలన వారి భావి మానవ సంబంధాలు ప్రభావితం కావడం జరుగుతుంది. అలాగే ఆల్కహాల్ గృహహింస, వైవాహిక అసమతుల్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పేదరికానికి దారి తీస్తుంది.ఉద్యోగాలని
కోల్పోతారు, గౌరవాన్ని కోల్పోతారు. అప్పుల పాలవుతారు. ఆల్కహాల్ వలన లైంగిక పటుత్వం తగ్గటం, తద్వారా భార్య మీద అనుమానం కలగటం, అది ద్వేషంగా మారి వారిని చంపటం, కుటుంబం చిన్నాభిన్నం అవటం అవుతుంది. చిత్రంగా ఇవన్నీ ఆల్కహాల్ వలన అవుతాయి అని చాలామందికి తెలిసినా తనవరకు ఇవి రావని ఆల్కహాల్
తాగుతుంటారు. అక్కడే ఊబిలో చిక్కుకుంటారు. ఎంతోమంది తెలివైనవారు ఈ ఆల్కహాల్ ఊబిలో పడి అర్ధాంతరంగా నలభై యాభై ఏళ్ళ వయసులో చనిపోవడం లేదా పూర్తిగా కాలేయం/మెదడు పాడైపోవడం చూసాను నేను. వాళ్ళందరూ చక్కగా ఉద్యోగాలు చేస్తూ, పదో ఇంటరో చదువుతున్న పిల్లలు గలవాళ్ళు. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని,
భార్యని, పిల్లల్ని అనాధలు చేసి వెళ్లిపోతున్నారు. ఆల్కహాల్ వ్యాసానికి వైద్యం ఉంది. మందులు, కౌన్సెలింగ్ తో నయం చెయ్యవచ్చు. కానీ ముందుగా ఆల్కహాల్ తాగే వ్యక్తి మానాలి అనుకోవాలి తప్పితే కుటుంబ సభ్యుల బలవంతం మీద మానతారనుకోవటం అపోహే అవుతుంది.
ఆల్కహాల్ ఎవరు తాగమన్నా నిర్మొహమాటంగా వద్దని చెప్పండి, యే మాత్రం మోతాదు అయినా మెదడుకి విషమే. తాగమని బలవంతపరిచే వాళ్ళని దూరంగా ఉంచండి, వాళ్ళు మీనిజమైన స్నేహితులు/బంధువులు కాదని గుర్తించండి. మీరు యే వృత్తిలో ఉన్నా ఆల్కహాల్ లేకుండా సంప్రదింపులు, సమావేశాలు జరపవచ్చని గ్రహించండి.
ఆల్కహాల్ ని బహుమతిగా ఇవ్వవద్దు, ఆల్కహాల్ ప్రత్యామ్నాయ యాడ్స్ చేసే నటుల్ని నిలదీయండి, ప్రేమ వైఫల్యానికి మందు ఆల్కహాల్ కాదు,ఆమాటకొస్తే మనసులోని యే బాధకీ ఆల్కహాల్ మందు కాదు.ఆనందాన్ని పంచుకోవడానికి ఆల్కహాల్ అవసరం లేదు.మీరు ఆల్కహాల్ తాగకపోవటం బలహీనత కాదు అదొక గొప్ప వ్యక్తిత్వ లక్షణం
అని మిమ్మల్ని ఎద్దేవా చేసేవారికి చెప్పండి. ఆల్కహాల్ యొక్క దుష్ఫలితాల గురించి మీపిల్లలకి చిన్నప్పట్నుంచి పదే పదే వివరించండి. ఆల్కహాల్ తాగటం హీరోల లక్షణం కాదని గట్టిగా చెప్పండి. ఒక సమాజం యొక్క సంఘటిత అధోగతి ఆ సమాజం యొక్క మొత్తం ఆల్కహాల్ వాడుకని బట్టి ఉంటుంది. ఇది తధ్యం. జైహింద్.

Loading suggestions...