Sri Samavedam Shanmukha Sarma
Sri Samavedam Shanmukha Sarma

@SriSamavedam

2 Tweets 9 reads Feb 13, 2024
శృంగేరి జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి సన్యాస స్వీకార శుభ దినోత్సవం సందర్భంగా
శ్రీసన్నిధానంవారి పూర్వాశ్రమ జీవితం :- శ్రీశ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి పూర్వాశ్రమ నామధేయం కుప్పా వేంకటేశ్వర ప్రసాదశర్మ. వీరు శ్రీ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని - శ్రీమతి
సీతానాగలక్ష్మి గార్ల దంపతులకు ద్వితీయపుత్రునిగా 24-07-1993 శ్రావణ శుద్ధ పంచమినాడు తిరుపతిలో జన్మించారు. వారిది కౌండిన్యగోత్రం. గుంటూరుజిల్లా లోని అనంతవరం వీరి స్వగ్రామం.
కుటుంబనేపథ్యం :- కుప్పావారి కుటుంబంలో ప్రఖ్యాతి చెందిన వేదశాస్త్రపండితులు అనేకమంది ఉన్నారు. వీరి పూర్వీకులందరూ పరంపరగా శృంగేరి జగద్గురువుల శిష్యులే. శ్రీ వేంకటేశ్వర ప్రసాదశర్మగారి తాతగారికి అన్నగారైన శ్రీ కుప్పా బైరాగిశాస్త్రిగారు అను సుప్రసిద్ధ కృష్ణయజుర్వేద పండితులు, వాజపేయ యాగం చేసినవారు, వీరు 1961లో శ్రీ అభినవ విద్యాతీర్థ మహస్వామివారు, 1985లో శ్రీ భారతీ తీర్థ మహస్వామివారు అనంతవరం గ్రామమునకు విచ్చేసినప్పుడు ఘనంగా స్వాగతించి, భక్తితో గురువులను సేవించి పాదపూజ చేసి శ్రీజగద్గురువుల కృపకు పాత్రులయ్యారు. శ్రీవేంకటేశ్వరప్రసాద శర్మగారితాతగారి మరో అన్నగారైన శ్రీ కుప్పా వేంకటాచలపతియాజిగారు శృంగేరి జగద్గురువుల అనుమతితో సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు.
వేంకటేశ్వర ప్రసాదశర్మగారి తాతగారైన శ్రీ కుప్పా రామగోపాల వాజపేయయాజిగారు కృష్ణయజుర్వేదాన్ని అధ్యయనం చేసిన వేదపండితులు. వాజపేయమనేశ్రౌతయాగాన్ని చేసినవారు. శ్రీశృంగేరి జగద్గురువుల శిష్యులు. శృంగేరిలో జరిగిన అనేక వైదిక కార్యక్రమాలలో పాల్గొన్నవారు. శ్రీ వేంకటేశ్వరప్రసాదశర్మ గారి తండ్రిగారి పేరు శ్రీ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధానిగారు. అవదానిగారు వారి తండ్రిగారివద్దనే వేదాధ్యయనం క్రమాంతం గావించారు. వైదుష్యం సంపాదించారు. తిరుమలతిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర వేదాధ్యయన పరిరక్షణలో భాగంగా వేదపారాయణ గావించేవారు శ్రీ సుబ్రహ్మణ్యావధానిగారు. తిరుపతి వేదపారాయణ స్కీములో పారాయణదారులుగా ఉంటూనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి అనుమతితో శాస్త్రఅధ్యయనం కోసం హైదరాబాదు శంకర మఠములోనున్న జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ శాస్త్రసంవర్ధినీ పాఠశాలలో తర్కశాస్త్రాన్ని అధ్యయనం మొదలుపెట్టారు.
మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ రామచంద్రుల కోటేశ్వరశర్మగారి వద్ద న్యాయ వేదాంతాలను పూర్తి చేశారు. అప్పటికి వేంకటేశ్వరప్రసాదశర్మ జన్మించలేదు.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి సంస్థలో పనిచేస్తూ శ్రీ శారదాచంద్రమౌళీశ్వరుల అనుగ్రహంతో శ్రీభారతీతీర్థ మహాస్వామివారిచే స్థాపించబడిన శాస్త్రపాఠశాలలోహైదరాబాద్ శంకరమఠం ప్రాంగణంలో శ్రీశారదాంబ వారి సన్నిధిలో, మహాస్వాములవారి ఆశీర్బలంతో శాస్త్రాధ్యయనం గావిస్తూ ఉన్నారు. ఆ పుణ్యదంపతులు శారదా అమ్మవారి దేవాలయం వెనుక నివాసం ఉంటూ పవిత్రంగా కాలంగడిపిన కారణంగా, వారికి శారదాంబ ఆశీస్సుల వలన స్వామివారి అనుగ్రహం వలన శాస్త్రాధ్యయనం పూర్తి అయింది. ఆ తరువాత ఆ దంపతులు తిరిగి తిరుపతిలో ఉద్యోగరీత్యా నివసిస్తున్న సమయంలో 1993లో వెంకటేశ్వరస్వామివారి సన్నిధిలో శ్రీవెంకటేశ్వరస్వామివారి ప్రసాదంగా వేంకటేశ్వర ప్రసాద్ శర్మ జన్మించడమైనది. శాస్త్రాభ్యాసం, దేశకాల వైశిష్ట్యాదుల వలన ఇంతటి ప్రసాదం లభించింది. ఇది ఒక అరుదైన భాగ్యం. ఇది కేవలం ఈ దంపతులకేకాక మొత్తం ఆ కుటుంబానికి ఆ వంశానికే దక్కిన మహాప్రసాదం.
బాల్యం :- శ్రీవేంకటేశ్వర ప్రసాదశర్మగారికి బాల్యం నుండే శ్రీకృష్ణభక్తి మెండు. తమ ఇంటిదగ్గరలోనున్న శ్రీకృష్ణదేవాలయాన్ని ప్రతినిత్యం సందర్శించేవారు. తండ్రి అయిదవ ఏటనే ప్రసాదశర్మకు ఉపనయనం చేశారు. తాతగారైన శ్రీకుప్పా రామగోపాల వాజపేయయాజిగారు కృష్ణయజుర్వేదం ప్రారంభించారు. తరువాత తండ్రిగారు
కృష్ణయజుర్వేదం క్రమాంతం నేర్పారు. వైదికజీవనం, దైవభక్తి మెండుగాగల వాతావరణంలో ఈబాల బ్రహ్మచారి పెరిగారు.
కృష్ణానది సముద్రంలో కలిసే సంగమప్రదేశంలో గల హంసలదీవి అను ఒకపుణ్య క్షేత్రం కలదు. అక్కడ శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ వేంకటేశ్వరప్రసాదశర్మగారి కుటుంబం అక్కడ భాగవతసప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీప్రసాదశర్మ కూడా తండ్రితోపాటు భాగవతసప్తాహ కార్యక్రమంలో పాల్గొనేవారు. బాల్యంలోనే అయోధ్య, హరిద్వార్, ఋషీకేశ్, కాశీ, కాలడి, మధురై, మధుర, పశుపతినాథ్ (నేపాల్), రామేశ్వరం, ఉజ్జయిని మొదలగు పుణ్యక్షేత్రాలను తాతగారు, తండ్రిగార్లతో తీర్థయాత్రలు కూడా చేసారు.
Continued in the next tweet..
శృంగేరిలో అధ్యయనం :- వేంకటేశ్వర ప్రసాద్ గారి తండ్రితాతగారు శృంగేరిలో ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనటానికి వచ్చినప్పుడు, వారితోపాటుగా శ్రీవేంకటేశ్వర ప్రసాదశర్మగారు కూడా వచ్చేవారు. మొదటిసారి 2006లో శృంగేరి వచ్చినప్పుడే జగద్గురు శ్రీశ్రీభారతీతీర్థ మహాస్వాముల వారిప్రభావం 13 సంవత్సరాల ఆ బాలబ్రహ్మచారి పైపడింది. 2008లో వారు మళ్ళీ శృంగేరిలో శ్రీచరణులను దర్శించారు. 2009లో మూడవసారి శృంగేరికి వచ్చినప్పుడు శ్రీజగద్గురువులవద్ద అధ్వయనం చేయాలనే తమకోరికను శ్రీజగద్గురువులకు విన్నవించారు. ఈ మహోజ్జ్వల ఘట్టామును కనులారా తిలకించుటకు దేశనలుమూలల నుండి చాలామంది ప్రసిద్దవ్యక్తులు, మఠాధిపతులు, అధికారులు, దేశవిదేశాలనుండివేలసంఖ్యలో వచ్చిన భక్తులు అపూర్వమైన ఈ మహోత్సవములో పాల్గొని ఉభయశ్రీచరణుల అనుగ్రహమును పొంది కృతార్థులయ్యారు.
సన్యాస స్వీకారం అయ్యాక సన్యాసాశ్రమ ధర్మములను, అనుష్ఠానక్రమమును, సంప్రదాయాలను మహాసన్నిధానంవారు సన్నిధానంవారికి వారే స్వయంగా ఉపదేశించారు. మఠంలో పాటించవలసిన సంప్రదాయాలన్నీ కూడ వారికి తెలిపారు.
2017లో శృంగేరిలో శారదాదేవాలయ స్వర్ణశిఖర కుంభాభిషేకమహోత్సవము వైభవంగా నిర్వహించారు. అదే సంవత్సరమున ఉభయశ్రీచరణులు తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో విజయయాత్ర చేయుచూ అనేక గ్రామనగరాలలో సంచరించి, అనుగ్రహభాషణలు, ఉపదేశాలతో భక్తజనులను అనుగ్రహించిరి.
శ్రీమహాసన్నిధానంవారి ఆజ్ఞానుసారం సన్నిధానంవారు 2018లో కర్ణాటక, ఆంధ్రదేశములో విజయయాత్ర చేయుచూ అనేక గ్రామనగరములు, క్షేత్రములలో సంచరించుచు శ్రీమహాసన్నిధానంవారి ప్రతిరూపులై భక్తులను అనుగ్రహించిరి. శ్రీ విధుశేఖరభారతీ స్వామివారు గురుచరణుల అడుగుజాడలలో నడచుచూ వారి అపారకృపాపాత్రులై వెలుగొందుచున్నారు. శ్రీవిధుశేఖరభారతీ సన్నిధానం వారి ఆలోచనలు, పనులు కూడ ఎల్లప్పుడూ శ్రీమహాసన్నిధానంవారి పూజనీయములైన పాదపద్మముల మీదనే కేంద్రీకృతములయ్యాయి. శిష్యజనులందరికీశ్రీమహాసన్నిధానంవారు తమ శిష్యునిగా శ్రీసన్నిధానంవారిని స్వీకరించి మనకందరికీ వారిని భక్తి శ్రద్ధలతో సేవించి శ్రేయఃప్రాప్తులయ్యే మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. ఈ విధముగా శ్రీ శృంగేరి శారదాపీఠ అవిచ్ఛిన్న గురుపరంపర కొనసాగుతూ వస్తుంది.

Loading suggestions...